సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఉపశమనం లభించింది. గ్రూప్-1 నియామకాల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వేముల అనూష్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ గురువారం విచారణ జరిపింది. గ్రూప్-1 ర్యాంకర్ల నియామకాలపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అయితే, రెండు రోజుల క్రితం ఇదే అంశంపై మరో పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. “హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర తీర్పు ఇచ్చిన దశలో మేము జోక్యం చేసుకోలేము,” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో, హైకోర్టు తీర్పు ప్రకారం నియామకాలు కొనసాగించవచ్చని పేర్కొంది. అక్టోబర్ 15న హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరపనున్నందున అప్పటివరకు మార్పులు అవసరం లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.