గుడ్‌న్యూస్..LRS గడువు మరోసారి పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం
లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్ఎస్) గడువుపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik
గుడ్‌న్యూస్..LRS గడువు మరోసారి పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం
లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్ఎస్) గడువుపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ స్కీమ్‌ను మరో మూడు రోజులు ( మే 3) వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందు నిర్ణయించిన ప్రకారం బుధవారంతోనే గడువు ముగిసింది. కాగా ఈ పథకంలో సుమారు 20 లక్షల మంది ఫీజు చెల్లించాల్సిన దరఖాస్తుదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు కేవలం 6 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే కనీసం నెల రోజులు అయినా గడువు పెంచాలని పురపాలక శాఖ అధికారులు ప్రతిపాదించారు. మొదట మే 15 వరకు మాత్రమే గడువు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆ తర్వాత కేవలం 3 రోజులే గ్రేస్ పీరియడ్‌గా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఈ మూడ్రోజుల గడువు సరిపోదని.. కనీసం నెల రోజులు పెంచాలని అధికారులు కోరారు. దీనిపై ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎ్‌సలో ఇప్పటి వరకు రూ.1,890 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో సీడీఎంఏ పరిధిలోని మునిసిపాలిటీల నుంచి వచ్చిందే రూ.1,229 కోట్లు. గ్రామ పంచాయతీల నుంచి రూ.193 కోట్లు, అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీల (యూడీఏ) నుంచి రూ.64 కోట్లు, జీహెచ్‌ఎంసీ నుంచి రూ.170, హెచ్‌ఎండీఏ నుంచి రూ.234 కోట్లు వసూలైంది. సీడీఎంఏ పరిధిలో అత్యధిక ఆదాయం రాగా.. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో ఆశించిన మేర ఆదాయం సమకూరలేదు. మార్చి నుంచి అమలులో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ గడువును ఇప్పటికే ఒకసారి ఏప్రిల్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.