గుడ్‌న్యూస్.. LRS రాయితీ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణలోని లే అవుట్ల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik
గుడ్‌న్యూస్..LRS రాయితీ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణలోని లే అవుట్ల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఎల్‌ఆర్ఎస్ ఫీజు 25 శాతం రాయితీతో చెల్లించేందుకు మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. తాజాగా ఆ గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.
లేఅవుట్ల క్రమబద్ధీకరణకు (LRS) ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ గడువు నిన్నటితో (మార్చి 31) ముగిసింది. లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకంలో భాగంగా ప్రభుత్వం 25 శాతం రాయితీతో వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (OTS)ను ప్రకటించింది. అనధికారిక లే అవుట్లలో ప్లాట్ల క్రమబద్దీకరణ కోసం ఈ స్కీంను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. అయితే మార్చి 31కో గడువు ముగియగా.. చాలా మంది ఇంకా పథకాన్ని వినియోగించుకోలేదు. ప్రస్తుతం చెల్లించాల్సిన ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తున్నారు. దీనిని ఏప్రిల్ 1 నుంచి 15 వరకు 15 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. ఆ తర్వాత రాయితీ పూర్తిగా తీసివేస్తారు. అంటే పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 2020లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి మార్చి 31 వరకు 25 శాతం రాయితీతో ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. అది కూడా ముగియడంతో ఇప్పుడు ఏప్రిల్ నెలాఖరు వరకు అవకాశం కల్పించారు.