మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్.. భారీగా పెరిగిన దరఖాస్తు ఫీజు..!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రిటైల్ మద్యం దుకాణాలకు ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

By Medi Samrat
Published on : 20 Aug 2025 3:00 PM IST

మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్.. భారీగా పెరిగిన దరఖాస్తు ఫీజు..!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రిటైల్ మద్యం దుకాణాలకు ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తదుపరి లైసెన్స్ వ్యవధి డిసెంబర్ 1, 2025న‌ మొద‌లై నవంబర్ 30, 2027తో ముగియనుంది. ఈసారి దరఖాస్తు రుసుము బాగా పెరిగింది. గతంలో రూ. 2 లక్షలు ఉండ‌గా.. ఇప్పుడు రూ. 3 ల‌క్ష‌లు అయ్యింది. అంటే ఏకంగా రూ.లక్ష పెరిగింది. ఫిక్స్‌డ్ షాప్ టాక్స్‌ ఆధారంగా లాటరీ పద్దతిలో వైన్ షాపులను కేటయించనున్నారు.

దరఖాస్తు దాఖలులో ఎలాంటి పరిమితులు లేవు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా సమర్పించుకోవచ్చు. లైసెన్స్ కాల పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. రాష్ట్రంలోని మొత్తం 2,620 మద్యం దుకాణాలకు ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువు నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి మద్యం దుకాణాల ఏర్పాటు కావల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త లైసెన్సులను లాటరీ ద్వారా ఎంపిక చేసేందుకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

మద్యం షాపు కేటాయింపుల్లో 30 శాతం రిజర్వేషన్లకు కేటాయించారు. గౌడ సామాజిక వర్గానికి 15 శాతం, షెడ్యూల్ కులాల సామాజిక వర్గాలకు 10 శాతం, షెడ్యూల్ తెగల సామాజిక వర్గానికి 5 శాతం వైన్స్ షాపులను కేటాయించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ప్రకారమే ఈసారి కూడా మద్యం దుకాణాల లైసెన్స్ జారీ ప్ర‌క్రియ చేప‌డుతుంది.

Next Story