హైదరాబాద్: గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 6 (శనివారం) నాడు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెలవు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అయితే, ఈ సెలవుకు బదులుగా అక్టోబర్ 11 (రెండో శనివారం) నాడు పూర్తి పని దినంగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గణేష్ నిమజ్జనం కారణంగా జంటనగరాలతో పాటు, పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశం ఉన్నందున, ప్రజల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.