చేనేత కార్మికులకు శుభవార్త చెప్పిన సర్కార్..ఆ రుణాల మాఫీకి గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో చేనేత కార్మికులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.
By Knakam Karthik Published on 9 March 2025 6:48 PM IST
చేనేత కార్మికులకు శుభవార్త చెప్పిన సర్కార్..ఆ రుణాల మాఫీకి గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో చేనేత కార్మికులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు చేనేత కార్మికులకు రూ.33 కోట్ల రుణమాఫీ ప్రాథమిక అనుమతులను మంజూరు చేసింది. ఈ పథకం కింద చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు ఉన్న రుణాలను సర్కారు మాఫీ చేయనుంది. 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్న లోన్ బకాయిలను మాఫీ చేయనున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
గతేడాది సెప్టెంబర్ 9న హైదరాబాద్ లోని జాతీయ చేనేత సాంకేతిక సంస్థ ప్రారంభోత్సవంలో చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించి.. తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు చేనేత సంఘాలు, వివిధ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. ఇదిలా ఉండగా.. గత బీఆర్ఎస్ సర్కారు చేనేత కార్మికులకు 2017 వరకు రుణమాఫీ చేసింది. జిల్లా సహకార బ్యాంకుల నుంచి, జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేసింది.