హైదరాబాద్‌లోని పాతబస్తీ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాత బస్తీ అగ్నిప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఈ సంఘటనలో 17 మంది చనిపోవడం బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నాం. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపిస్తుంది..అని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.
కాగా ఆదివారం ఉదయం చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి 17 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆదివారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. కొందరు ఘటనాస్థలంలో.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.