Telangana: బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థినిలకు అస్వస్థత
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది.
By - అంజి |
Telangana: బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థినిలకు అస్వస్థత
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్ కారణంగా 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్‌లో నిన్న రాత్రి వండిన మిల్ మేకర్ కూరతో కలిపి అన్నం తిన్న తర్వాత విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యం పాలై వాంతులు చేసుకొని స్పృహ కోల్పోయారు. 108కి కాల్ చేయమని విద్యార్థినులు వేడుకున్నా.. కనికరించకుండా హాస్టల్ సిబ్బంది అలాగే చూస్తూ కూర్చున్నారని విద్యార్థిని ఆరోపించారు. చివరకు ఫుడ్ పాయిజన్ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని హాస్టల్ వార్డెన్ విద్యార్థినులకు ఆర్ఏంపీ వైద్యుడితో చికిత్స చేయించిందని సమాచారం.
అన్నంలో పురుగులు వచ్చాయని తెలిపినా పడేయకుండా అలానే తినాలని వార్డెన్, సిబ్బంది కర్కశత్వంగా ప్రవర్తించారని విద్యార్థినిలు చెబుతున్నారు. పురుగులు రావడంతో 40 మంది విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వాంతులు చేసుకొని, కళ్ళు తిరిగి, ఎక్కడికక్కడే విద్యార్థినులు కుప్పకూలారు. విషయం బయటకు తెలిపిస్తే పరువు పోతుందని వార్డెన్ అస్వస్థతకు గురైన విద్యార్థినులకు ఆర్ఏంపీ వైద్యుడితో ఇంజక్షన్, టాబ్లెట్ ఇప్పించిందని బాలికలు చెప్పారు. సాయంత్రం 7:30 గంటలకు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని ఫోన్ చేసి తెలపగా, రాత్రి 10 గంటలకు హాస్టల్ వద్దకు వార్డెన్ వచ్చిందని, ఆ మూడు గంటలు నరకం అనుభవించామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరామర్శించారు.