కేసీఆర్, ఆయన కుటుంబం సీమాంధ్ర నేతల్లా మాట్లాడుతున్నారు: రేవంత్‌రెడ్డి
తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారం ఊపందుకుంది. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విమర్శల దాడులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 19 Nov 2023 2:54 PM ISTకేసీఆర్, ఆయన కుటుంబం సీమాంధ్ర నేతల్లా మాట్లాడుతున్నారు: రేవంత్‌రెడ్డి
తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారం ఊపందుకుంది. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విమర్శల దాడులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా, సభలు, ర్యాలీలు ఇలా అన్ని మార్గాల్లోనూ ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఈక్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
2012 నుంచి 2014 వరకు సీమాంధ్ర నేతలు మాట్లాడినట్లుగానే.. ఇప్పుడు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. రూ.5వేల పెన్షన్ ఇస్తామని కేసీఆర్ ఇప్పుడు చెప్తున్నారనీ.. మరి ఈ పదేళ్లలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణలో నిజాం పాలన కొనసాగుతోందని.. నిజాం రాజులానే కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. కానీ నిజాం పాలనను వ్యతిరేకించిన చరిత్ర తెలంగాణకు ఉందని.. అలాగే కేసీఆర్ పాలనకు ప్రజలకు స్వస్తి చెబుతురాని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు ఆకలిబాదను తట్టుకుంటారు కానీ.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోరు అన్నారు. ఇప్పుడు మరో ఉద్యమానికి ఊపిరి ఊదాల్సిన పరిస్థితి ఉందన్నారు రేవంత్‌రెడ్డి.
కాంగ్రెస్ మేనిఫెస్టోను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని తనకు నమ్మకం ఉందన్నారు రేవంత్. ఈసారి జరగబోయే ఎన్నికలను ఉద్యమంలా చూడాలని కోరారు. ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే అన్నారు. కానీ కేసీఆర్ ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ తాము రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెబుతోంది.. కానీ ఎక్కడా ఇది అందడం లేదన్నారు. కావాలంటే ఏ సబ్‌స్టేషన్‌కు వచ్చి నిరూపించేందుకు అయినా తాను సిద్ధమన్నారు రేవంత్‌రెడ్డి. ప్రస్తుతం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందనీ.. కాంగ్రెస్ మేనిఫెస్టో ద్వారానే ఇది జరిగిందన్నారు. అలాగే తాము అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు.