సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార రథాన్ని చూశారా..!
సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా ఒక బస్సును సిద్ధం చేసింది బీఆర్ఎస్.
By Srikanth Gundamalla Published on 15 Oct 2023 1:00 PM ISTసీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార రథాన్ని చూశారా..!
తెలంగాణలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలోకి వెళ్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా తన తొలి జాబితాను విడుదల చేసింది. పోలింగ్ తేదీ నాటికి ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి ఓట్లు తమకే వేయాలని.. గెలుపునకు కృషి చేయాలని కోరేందుకు అభ్యర్థులంతా దూసుకెల్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూడా స్వయంగా ప్రచారంలోకి దిగనున్నారు. హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ ప్రచారానికి శ్రీకారం చుడతారు. అచ్చువచ్చిన హుస్నాబాద్ గడ్డపై ఎన్నికల సమరశంఖం పూరిస్తారు. ఆ తర్వాత 17 రోజుల్లో 42 సభలతో సుడిగాలి పర్యటన చేస్తారు సీఎం కేసీఆర్.
అయితే.. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా ఒక బస్సును సిద్ధం చేసింది బీఆర్ఎస్. అధినేత చిత్రం.. కారు గుర్తుతో పాటు భారతదేశ చిత్రపటం, గులాబీ రంగు గుభాళింపుతో సీఎం కేసీఆర్ ప్రచార రథం సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యింది. ఈ బస్సుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం కేసీఆర్‌కు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రచార రథం బహుమతిగా ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు ఈ ప్రచార రథం చేరుకుంది. నేటి నుంచి మొదలయ్యే కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణ రోడ్లపై ఈ ప్రచార రథం పరుగులు పెట్టనుంది.