బీజేపీని వీడటంపై క్లారిటీ ఇచ్చిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 2:15 PM ISTబీజేపీని వీడటంపై క్లారిటీ ఇచ్చిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు నాయకులు పార్టీ అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే.. త్వరలోనే సొంత పార్టీలో చేరబోతున్నట్లు కూడా ప్రకటించారు. అయితే.. రాజగోపాల్‌రెడ్డితో పాటు మరో బీజేపీ నేత కూడా పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. ఆయనే మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. పార్టీ మార్పు ప్రచారంపై వివేక్ వెంకటస్వామి తాజాగా స్పందించి క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కూడా హాజరు అయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ మార్పు ప్రచారం గురించి ఆయన్ని విలేఖరులు ప్రశ్నలు అడగ్గా.. ఇలా సమాధానం చెప్పుకొచ్చారు. తాను పార్టీ మారుతారనే ప్రచారం చాలా రోజులుగా ఉందని చెప్పారు. తాను బీజేపీకి రాజీనామా చేయనని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. అయితే.. బీజేపీకి తాను రాజీనామా చేస్తున్నాను అనే వార్తలు అవాస్తవమని వివేక్ వెంకటస్వామి ఈ సందర్భంగా కొట్టిపారేశారు.
తాను పార్టీ మారను అనడానికి సాక్ష్యం ఇవాళ హార్యానా గవర్నర్ నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమానికి హాజరవ్వడమే అని చెప్పారు వివేక్ వెంకటస్వామి. కాగా.. మరో బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంపైనా ఆయన స్పందించారు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన విషయం తనకు తెలియదన్నారు. ఇకనైనా తాను పార్టీ మారతానని తప్పుడు ప్రచారం చేస్తున్నవారు వెనక్కి తగ్గాలని వివేక్ వెంకటస్వామి సూచించారు.