కేంద్రం నిధులను కేసీఆర్ ప్రజలకు చేరనివ్వట్లేదు: జేపీ నడ్డా

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుంది.

By Srikanth Gundamalla  Published on  19 Nov 2023 3:33 PM IST
telangana, elections, bjp, JP Nadda, campaign,

కేంద్రం నిధులను కేసీఆర్ ప్రజలకు చేరనివ్వట్లేదు: జేపీ నడ్డా

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుంది. నవంబర్ 30న పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారం చేపట్టేందుకు ప్రధాన పార్టీలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన జాతీయ నేతలు రాష్ట్రానికి వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే నారాయణపేటలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు.

తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు బీజేపీకి, కుటుంబ పార్టీలకు మధ్య జరుగుతున్నాయని అన్నారు జేపీ నడ్డా. ఇతర రాష్ట్రాల్లో లాగానే తెలంగాణలో కూడా బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతోందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంటే.. ఇక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు అందనివ్వడం లేదని ఆరోపించారు. పైగా కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం కేంద్రం విడుదల చేసిన నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే కేసీఆర్‌ ఆ ప్రయోజనం ప్రజలకు అందకుండా చేశారని జేపీ నడ్డా చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకుందని.. దొరికినంత దోచుకున్నారంటూ జేపీ నడ్డా ఆరోపణలు చేశారు. అయితే.. లక్ష కోట్లతో నిర్మించిన ఆ ప్రాజెక్టు ఇటీవల కుంగిపోయిందని.. ఎలా నిర్మించారో అర్థం అవుతోందంటూ చెప్పారు. అయితే..తాము తెలంగాణలో అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించి.. ఆయన్ని జైలుకు పంపిస్తామని చెప్పారు. అంతేకాదు.. కేసీఆర్ గతంలో చెప్పిన చాలా హామీలను విస్మరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు కేవలం ఓట్ల కోసమే మాట్లాడుతున్నాయని అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చెప్పిన పనులన్నీ చేసిందని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా హామీల అమలులో విఫలమైందని జేపీ నడ్డా అన్నారు. అక్కడ పథకాలూ అమలు కావడం లేదని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ఒక్క గ్యారెంటీని అమలు చేయలేదని.. అలాంటిది ఇక్కడెలా చేస్తారని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యం అని.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు.

Next Story