Telangana: ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో పార్టీ మద్దతు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 6 Nov 2023 10:00 AM GMTTelangana: ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో పార్టీ మద్దతు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీల నుంచి టికెట్ దక్కలేదని కొందరు నాయకులు రాజీనామాలు చేస్తూ.. అధిష్టానాలకు షాక్‌లు ఇస్తున్నారు. కానీ.. ప్రధాన పార్టీలు మాత్రం ముఖ్య నాయకులను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూనే.. ఎలాగైనా అధికారం చేపట్టాలని వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా కీలక చర్యలు తీసుకుంటోంది. ఆయా పార్టీల మద్దతు కోరుతోంది. ఇప్పటికే వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని ప్రకటించారు. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇక సీపీఐతో కూడా కాంగ్రెస్ పొత్తు ఖరారు అయ్యింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జన సమితి పార్టీ కూడా కాంగ్రెస్‌కు మద్దతు తెలిపింది.
ఆయా పార్టీల మద్దతుతో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. బీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతోంది. ఎలాగైనా కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించి.. తాము అధికారం చేపడతామని.. తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రచారం జోరుగా చేస్తోంది కాంగ్రెస్. ఈ సమయంలో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మరో పార్టీ మద్దతు ప్రకటించింది. మరింత బూస్టప్ అందినట్లు అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతన్నట్లు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ప్రకటించింది.
తెలంగాణలో బీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు IUML వెల్లడించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కేరళ ఎమ్మెల్యే పీకే కున్హాలికుట్టి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ లేఖ రాశారు. తెలంగాణలో తమకు బలమైన పునాదులు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ముస్లిం లీగ్ మద్దతు తెలుపుతోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు కలిసి పనిచేస్తామని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలోని ఇండియన్ ముస్లిం లీగ్ నేతలు, పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో ఉత్సహంగా పాల్గొని కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే పీకే కున్హాలికుట్టి పిలుపునిచ్చారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతుతో కాంగ్రెస్ పార్టీకి బిగ్ బూస్ట్ వచ్చినట్లయింది.