Telangana Polls: రేపే పోలింగ్.. ఈ రూల్స్ మర్చిపోవద్దు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
By అంజి Published on 29 Nov 2023 7:36 AM ISTTelangana Polls: రేపే పోలింగ్.. ఈ రూల్స్ మర్చిపోవద్దు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పోలింగ్‌కు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 35,655 పోలింగ్ కేంద్రాల్లో 3.26 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1.62 కోట్ల మంది పురుషులు, 1.53 కోట్ల మహిళలు, 2676 మంది ట్రాన్స్‌జెండర్లు, 15,406 మంది సర్వీసు ఓటర్లు, 2944 మంది ప్రవాస ఓటర్లు ఉన్నారు. 2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. 2290 మంది అభ్యర్థుల్లో 221 మంది స్త్రీలు, ఒక ట్రాన్స్ జెండర్ బరిలో ఉన్నారు. ఎన్నికల విధుల్లో 1.40 లక్షల మంది పాల్గొననున్నారు. పోలింగ్ కేంద్రాలకు అధికారులు ఇవాళ సాయంత్రానికే చేరుకోనున్నారు.
రేపు పోలింగ్ సందర్భంగా ఇవాళ, రేపు ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. హైదరాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. మిగతా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలు లేని, వాటిల్లోని టీచర్లకు ఎలక్షన్ డ్యూటీ లేకుంటే ఆ స్కూళ్లు పని చేస్తాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. పోలింగ్ జరిగే 30న అన్ని విద్యా సంస్థలు, కార్యాలయాలకు సెలవు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓట్లకు ప్రాధాన్యం పెరిగింది. ఈసారి దాదాపు 17 లక్షల మంది కొత్తగా ఓటు వేయబోతున్నారు. వీరిలో 18 - 19 ఏళ్ల వాఉ 8.11 లక్షల మంది ఉన్నారు.
హైదరాబాద్‌లో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. నగరంలోని 15 నియోజవర్గాల్లో 312 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న వారు ఓటు వేయవచ్చు.
ఇక ఓటర్లు ఓటు వేసేందుకు వెళ్లిన సమయంలో తప్పనిసరిగా ఓటర్ స్లిప్, ఓటర్ ఐడీ లేదా ఇతర గుర్తింపు కార్డులు ఆధార్, కేంద్ర కార్మికల శాఖ జారీ చేసే కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్‌పోర్టు, పెన్షన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే జాబ్ కార్డులు ఎది ఉంటే.. అది తీసుకుని తీసుకెళ్లాలి. మొదటి అధికారి జాబితాలో మీ పేరును పరిశీలిస్తారు. అన్ని సరిగా ఉంటే రెండో అధికారి దగ్గరకు పంపుతారు.
రెండో అధికారి మీ వేలుకు ఇంక్ అంటించి, చీటీ ఇస్తారు. ఆ చీటీని మూడో అధికారి పరిశీలిస్తారు. అనంతరం ఈవీఎం దగ్గరకు పంపుతారు. ఈవీఎంలో బటన్ నొక్కగానే బీప్ అని పెద్దగా శబ్దం వస్తుంది. లేదంటే అధికారికి సమాచారం ఇవ్వాలి. అలాగే పోలింగ్ కేంద్రం దగ్గర పార్టీల గుర్తులు, రంగులు కలిగిన బట్టలు, టోపీల వంటివి ధరించకూడదు. పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. బూత్ లోపలికి సెల్‌ఫోన్లు తీసుకెళ్లకూడదు. అక్కడుండే భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించాలి.