Telangana: పిల్లలపై కుక్కల దాడులు.. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

చిన్నారులపై వీధి కుక్కల దాడులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధికుక్కల దాడి వల్ల అనేక మంది చనిపోవడంతో కోర్టు జీహెచ్‌ఎంసీని నిలదీసింది.

By అంజి  Published on  18 July 2024 4:30 PM IST
Telangana, Dog attacks, High Court, CM Revanth, TS government

Telangana: పిల్లలపై కుక్కల దాడులు.. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌: చిన్నారులపై వీధి కుక్కల దాడులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధికుక్కల దాడి వల్ల అనేక మంది చనిపోవడంతో జీహెచ్‌ఎంసీని కోర్టు నిలదీసింది. ఇటీవల కాలంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగాయి. రోజూ ఏదో ఓ చోట వీధి కుక్కలు చిన్నారులపై దాడి చేసిన ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కుక్కల నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశించింది. పరిష్కారాలతో రావాలంటూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

అటు జీహెచ్‌ఎంసీ పరిధిలో 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదని పేర్కొంది. రహదారులపై వ్యర్థాల వల్లే కుక్కల స్వైరవిహారం ఎక్కువైందని చెప్పుకొచ్చింది. అయితే రోడ్లపై వ్యర్థాలను నిర్మూలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. కుక్కల దాడులను నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సమస్యను ప్రభుత్వం మానవీయ కోణంలో పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది.

Next Story