కర్ణాటకలో హైదరాబాద్ వైద్యురాలు మృతి, నదిలో ఈతకు దిగి తిరిగిరాని లోకాలకు..
మహిళా వైద్యుల బృందం విహార యాత్ర విషాద యాత్రగా మారి ఓ వైద్యురాలు ప్రాణం తీసుకుంది.
By Knakam Karthik
కర్ణాటకలో హైదరాబాద్ వైద్యురాలు మృతి, నదిలో ఈతకు దిగి తిరిగిరాని లోకాలకు..
మహిళా వైద్యుల బృందం విహార యాత్ర విషాద యాత్రగా మారి ఓ వైద్యురాలు ప్రాణం తీసుకుంది. తెలంగాణకు చెందిన ఓ లేడీ డాక్టర్.. కర్నాటక హాలీడే ట్రిప్ ఫ్లాన్ చేసుకున్నారు. అక్కడి సనాపూర్ దగ్గరలోని తుంగభద్ర రివర్ వద్దకు వెళ్లారు. అక్కడి వాతావరణం నచ్చడంతో స్విమ్ చేయాలని భావించారు. బుధవారం మధ్యాహ్నం డాక్టర్ అనన్య రావు సరదాగా ఈత కొట్టేందుకు ఏకంగా 25 అడుగుల ఎత్తు కొండ నుంచి తుంగభద్ర నదిలో దూకి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆ ఉద్ధృతిలో ఆమె కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అనన్య రావు నీళ్లలోకి దూకిన వీడియోలు నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని తుంగభద్ర నది వద్ద ఈ విషాదం జరిగింది.
అనన్య రావు తన స్నేహితులు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్‌కు వెళ్లారు. అక్కడ పర్యాటక ప్రాంతాల్లో విహరించి.. మంగళవారం రాత్రి నణాపుర గ్రామంలోని ఓ అతిథి గృహంలో బస చేశారు. వారు ముగ్గురు గెస్ట్‌హౌస్ వెనుక ఉన్న తుంగభద్ర నదిలో స్విమ్మింగ్ చేసేందుకు వెళ్లారు. అయితే స్విమ్మింగ్ బాగా వచ్చిన అనన్య.. ఈత కొట్టాలనే ఉత్సాహంతో సమీపంలోని గట్టు పైనుంచి వాటర్‌లోకి దూకింది. ఆ తర్వాత ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగింది. ఊహించని ప్రవాహంతో ఆమె కొట్టుకుపోయిందని తోటి స్నేహితులు తెలిపారు. స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. డాక్టర్ అనన్య నీటిలోకి దూకుతున్న దృశ్యాలు ఆమె ఫ్రెండ్ మొబైల్ ఫోన్‌లో రికార్డు అయినట్లు పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.