కొణతం దిలీప్ అరెస్ట్.. ఖండించిన కేటీఆర్‌

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ కొణతం దిలీప్‌ను సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు

By Medi Samrat  Published on  18 Nov 2024 5:55 PM IST
కొణతం దిలీప్ అరెస్ట్.. ఖండించిన కేటీఆర్‌

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ కొణతం దిలీప్‌ను సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ మీడియా హెడ్‌గా కొణతం దిలీప్ వ్యవహారించారు. ఎన్నిక‌ల అనంత‌రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో కొణతం దిలీప్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ స‌ర్కార్ ల‌క్ష్యంగా సోష‌ల్ మీడియాలో పోస్టులుపెడుతున్నారు.

ఇటీవ‌ల మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా రంగంలోకి దిగడంతోపాటు లగచర్ల ఘటనలపై సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి సర్కార్‌పై తీవ్ర వ్యతిరేక ప్రచారం జరిగింది. దీనిని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇలాంటి పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకునే క్ర‌మంలోనే కొణతం దిలీప్‌ను అరెస్ట్ చేసినట్లు సమాచారం.

కొణతం దిలీప్ అరెస్టుపై కేటీఆర్ స్పందించారు. ఆయ‌న ఎక్స్‌లో.. ప్రశ్నిస్తే సంకెళ్లు.. నిల‌దీస్తే అరెస్టులు.. నియంత రాజ్యమ‌ది.. నిజాం రాజ్యాంగ‌మిది.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కొణతం దిలీప్ అరెస్ట్.. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా.? అని ప్ర‌శ్నించారు. ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావ్..! ప్రజాస్వామ్య ప్రేమికులం.. ప్రజాస్వామ్యబద్దంగానే ఎదుర్కొంటాం.! నీ అక్రమ అరెస్టులకో.. నీ ఉడత బెదిరింపులకో.. భయపడం..! నీ అక్రమ అరెస్టులకు భయపడేవాడు ఎవరూ లేరిక్కడ అని ఖండించారు.

Next Story