Telangana: మరో నోటిఫికేషన్‌.. నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి గుడ్‌న్యూస్‌

నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్‌న్యూస్‌ చెప్పారు. త్వరలోనే 11 వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయబోతున్నట్టు ప్రకటించారు.

By అంజి  Published on  14 July 2024 6:06 PM IST
Telangana, Deputy CM Bhatti Vikramarka, unemployed, Hyderabad

Telangana: మరో నోటిఫికేషన్‌.. నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి గుడ్‌న్యూస్‌ 

హైదరాబాద్‌: నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్‌న్యూస్‌ చెప్పారు. త్వరలోనే 11 వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు అభ్యర్థులు డీఎస్సీకి బాగా ప్రిపేర్‌ కావాలని సూచించారు. త్వరలో మరికొన్ని ఖాళీలతో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య లేకపోవడంతో పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న భట్టి.. స్థానిక ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వడానికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు సాధ్యం కాదని తెలిసిన గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించిందన్నారు.

గత ప్రభుత్వ 10 సంవత్సరాల పాలనలో గ్రూప్ వన్, గ్రూప్ 2, డీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగులను గాలికి వదిలేశారని భట్టి ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం రాగానే మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. మరో 13,321 మంది ఉద్యోగుల నియామక ప్రక్రియ చివరి దశకు చేరిందన్నారు. ఇందులో గురుకుల పిఈటి, అసిస్టెంట్ ఇంజనీర్లు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ లెక్చరర్లు, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయని తెలిపారు.

జాబ్ క్యాలెండర్ విడుదల ప్రక్రియను వేగవంతం చేశామని, గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. 1,75,527 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని, తమ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వ డీఎస్సీ నోటిఫికేషన్ రీ షెడ్యూల్ చేసి వారు 5000 మందికి నోటిఫికేషన్ ఇవ్వగా, తాము మరో 6000 కలిపి 11 వేల మందికి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. తాజా నోటిఫికేషన్ కు స్పందించి 2.79 లక్షల మంది అప్లై చేసుకున్నారని, ఇప్పటికే రెండు లక్షల 5వేల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

తాము లోతుగా అధ్యయనం చేయగా ప్రస్తుతం వెలువరించిన 11,000 మంది నోటిఫికేషన్ కు పోగా.. మరో ఐదు వేల ఖాళీలు ఉన్నాయని, ఈ ఐదువేల ఖాళీలతో పాటు మరికొన్ని ఖాళీలను కలిపి మరో డీఎస్సీ నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ ప్రభుత్వం తరచూ డీఎస్సీ నోటిఫికేషన్ లు వేస్తూనే ఉంటుందన్నారు. ఇటీవల రాష్ట్రంలో 19 వేల మంది పైచిలుకు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, ఏ చిన్న ఇబ్బంది లేకుండా 34,000 మంది ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించామన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో సీఎల్పీ నేతగా తాను పలుమార్లు ప్రభుత్వాన్ని అసెంబ్లీలో డిమాండ్ చేయగా, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా నోటిఫికేషన్ వేస్తే ఆ పేపర్ లీక్ అయ్యిందన్నారు.

''గత ప్రభుత్వం గ్రూప్-2 ఎగ్జాంను మూడుసార్లు వాయిదా వేసింది.. 800 పోస్టులకు 5,51, 943 మంది అప్లై చేయగా మా ప్రభుత్వం రాగానే ఆగస్టులో పరీక్షలు నిర్వహించేందుకు తేదీలు ఖరారు చేశాం. గత ప్రభుత్వం గ్రూప్ త్రీ పరీక్షల కోసం 30/12/2222 న 1,380 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు.. కానీ పరీక్షలు నిర్వహించలేదు. మా ప్రభుత్వం రాగానే గ్రూప్ త్రీ కి సంబంధించిన మూడు పేపర్లకు పరీక్షలు నిర్వహించేందుకు నవంబర్ మాసంలో తేదీలు ఖరారు చేశాం'' అని తెలిపారు.

తెలంగాణ బిడ్డలు జీవితాల్లో స్థిరపడాలనేదే తమ ప్రభుత్వం ఆశ, డీఎస్సీ కి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు బాగా పరీక్షలు రాసి త్వరితగతిన ప్రభుత్వ పాఠశాలల్లోని పేద బిడ్డలకు పాఠాలు చెప్పాలనేది తమ ప్రభుత్వం కోరిక అని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.

Next Story