గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు.. నేడు సీఎల్పీ సమావేశం

డిసెంబర్ 4న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ఇంటర్నెట్‌లో ప్రచారం అవుతున్న లేఖ నకిలీదని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

By అంజి  Published on  4 Dec 2023 1:04 AM GMT
Telangana, Congress leaders, Governor, CLP meeting

గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు.. నేడు సీఎల్పీ సమావేశం

హైదరాబాద్: డిసెంబర్ 4న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ఇంటర్నెట్‌లో ప్రచారం అవుతున్న లేఖ నకిలీదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. తెలంగాణ అదనపు డీజీపీకి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పంపిన అధికారిక కమ్యునికేషన్‌ లాగా ఉన్న లేఖలో ఇలా ఉంది, “తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొడంగల్ ఎమ్మెల్యే శ్రీ అనుముల రేవంత్ రెడ్డి 4-12-2023న హైదరాబాద్‌లో ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని మీకు తెలియజేయడానికి ఇది” అంటూ ఓ లెటర్ నెట్టింట ప్రచారం అవుతోంది.

తెలంగాణా ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికే కాంగ్రెస్ 64 సీట్లు గెలుచుకోవడంతో ఈ లేఖ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. కాంగ్రెస్‌ నేతల బృందం గవర్నర్‌ తమిళిసైని కలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ లేఖ అందజేశారు. సోమవారం శాసనసభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని నేతలు చెప్పినట్టు సమాచారం. గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు డీకే శివకుమార్‌, మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు. సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారోత్సవానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు అందినట్టు తెలిసింది.

గవర్నర్‌ని కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పామని డీకే శివ కుమార్‌ తెలిపారు. తమకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పామన్నారు. సోమవారం ఉదయం 9.30గంటలకు సీఎల్పీ సమావేశం ఉంటుందన్న ఆయన.. కాంగ్రెస్‌లో ఒక విధానం ఉంటుంది.. ఆ ప్రకారమే ప్రక్రియ ఉంటుందని తెలిపారు.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64 సీట్లు, బీఆర్‌ఎస్‌కు 39, బీజేపీకి 8, ఏఐఎంఐఎంకు 7, కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐకి 1 సీటు లభించింది. తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అందజేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో అపాయింట్‌మెంట్ కోరినట్లు మీడియాలో కథనాలు వెలువడుతుండగా, ఒక మలుపులో కేసీఆర్‌ తన రాజీనామా లేఖను ఓఎస్‌డీ ద్వారా పంపి, గజ్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లినట్లు సమాచారం.

Next Story