లోక్‌సభ ఎన్నికలు.. టికెట్ల కోసం పోటాపోటీ.. దరఖాస్తులను ఆహ్వానించిన టీ కాంగ్రెస్
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన అభ్యర్థుల నుంచి జనవరి 30, మంగళవారం దరఖాస్తులను ఆహ్వానించింది.
By అంజి
లోక్‌సభ ఎన్నికలు.. టికెట్ల కోసం పోటాపోటీ.. దరఖాస్తులను ఆహ్వానించిన టీ కాంగ్రెస్
హైదరాబాద్: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన అభ్యర్థుల నుంచి జనవరి 30, మంగళవారం దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్థుల ఎంపికపై పూర్తి అధికారం ఏఐసీసీ, చీఫ్ మల్లికార్జున్ ఖర్గేలదేనని రాష్ట్ర కాంగ్రెస్ ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. మార్చి 3 వరకు దరఖాస్తులను పరిశీలిస్తామని రేవంత్ తెలిపారు. దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు మంత్రులు, ఇన్‌ఛార్జ్‌లను కేటాయించారు.
తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్, విష్ణునాథ్, తదితరులతో పాటు టీపీసీసీ చీఫ్ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ సమావేశం అనంతరం కీలక నిర్ణయాలను ప్రకటించారు. మరోవైపు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్లకు పోటాపోటీ వాతావరణం నెలకొంది. రాజ్యసభ ఎన్నికల ప్రకటన వెలువడటంతోపాటు లోక్‌సభ పోరు సమీపిస్తున్న తరుణంలో ఆశావహులు టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సామాజికవర్గాల వారీగా టికెట్ల కేటాయింపులో ప్రాతినిధ్యం కల్పించాలని ఏఐసీసీ ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రిజర్వుడ్ స్థానాలు 5 పోగా మిగిలిన 12లో బీసీలకు కనీసం నాలుగైదు దక్కే సూచనలున్నాయి.
60 రోజుల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటికే రాజ్యసభ షెడ్యూల్ ముగిసింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాల కోసం కేడర్ కష్టపడాలి అని సమావేశంలో ఆయన అన్నారు. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమయ్యే సమావేశాలతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తుందని టీపీసీసీ చీఫ్ తెలియజేసారు. “తొలి సమావేశం ఇంద్రవెల్లిలో. పెద్దఎత్తున విజయవంతం చేసేందుకు కృషి చేయాలి అని సమావేశంలో నేతలను ఉద్దేశించి అన్నారు.