మహిళలకు రూ.2,500 ఆర్థికసాయంపై ఆరోజే గుడ్‌న్యూస్..!

తెలంగాణలో కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల హామీలతోనే అధికారంలోకి వచ్చింది.

By Srikanth Gundamalla  Published on  10 March 2024 10:15 AM IST
telangana, congress government, good news,  women,

మహిళలకు రూ.2,500 ఆర్థికసాయంపై ఆరోజే గుడ్‌న్యూస్..!

తెలంగాణలో కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల హామీలతోనే అధికారంలోకి వచ్చింది. దాంతో.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో భాగంగా.. నాలుగింటిని అమలు చేస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. ఇక ఆరోగ్య శ్రీ పరిమితిని ప్రభుత్వం రూ.10లక్షలకు పెంచింది. ఆ తర్వాత గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌.. రూ.500కే గ్యాస్‌ సిలిండర్లను అందిస్తోంది. మార్చి నెల నుంచే ఈ రెండు పథకాలను ప్రారంభించింది. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మార్చి 11న భద్రాచలంలో ప్రారంభించనున్నారు.

ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళలంతా ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని వేయి కళ్లతో చూస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఆర్థిక సాయం మహిళలకు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం విషయంలో మరో రెండ్రోజుల్లో ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 12న తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మహిళలకు రూ.2500 ఆర్థికసాయం అందించడంపై చర్చించనున్నారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడ్డ నేపథ్యంలో ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా లబ్ధి పొందొచ్చనే అంశంపై కాంగ్రెస్‌ ఆలోచిస్తోంది. ఈ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. పథకానికి కావాల్సిన నిధులు, అర్హుల ఎంపిక విధానం, మార్గదర్శకాలపై అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు మహిళలకు వడ్డీ లేని రుణ పథకాన్ని పునఃప్రారంభించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఈ నెల 12న హైదరాబాద్‌లో భారీ మహిళా సదస్సు నిర్వహించనున్నారు. కేబినెట్‌ సమావేశంలో ఈ పథకానికి నిధుల కేటాయింపుతో పాటు ఇతర నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంది. ఇక ఈ నిర్ణయాలను మహిళా సదస్సుపై ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు రైతుభరోసా పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. పలు కీలక మార్పులు చేయనుంది. అర్హులైన వారికే రైతుభరోసా వర్తింపజేయాలని చూస్తోంది. వచ్చే వానాకాలం నుంచి ఇది అమలు పర్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కూడా కేబినెట్‌ సమావేశంలో చర్చించి.. ఆమోదం తెలపనున్నారు.

Next Story