రేవంత్ రెడ్డి స‌హా కాంగ్రెస్ నేత‌ల గృహ‌నిర్భంధం

Telangana Congress chief Revanth Reddy house arrest.విద్యుత్ చార్జీల పెంపు, ధాన్యం కొనుగోలు పోరాటంలో భాగంగా నేడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2022 10:56 AM IST
రేవంత్ రెడ్డి స‌హా కాంగ్రెస్ నేత‌ల గృహ‌నిర్భంధం

విద్యుత్ చార్జీల పెంపు, ధాన్యం కొనుగోలు పోరాటంలో భాగంగా నేడు విద్యుత్ సౌధ, సివిల్ సప్లైస్ భవనాల ముట్టడికి తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌ల‌ను పోలీసులు గృహ‌నిర్భందం చేశారు. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌, సీఎ‍ల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియ‌ర్ నేత‌లు ష‌బ్బీర్ అలీ, మల్లు ర‌వీ, దాసోజు శ్ర‌వ‌ణ్ త‌దిత‌రుల‌ను హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ నేప‌థ్యంలో జూబ్లీహిల్స్‌లోని ఆయ‌న నివాసం వ‌ద్ద పెద్ద సంఖ్య‌లో పోలీసులు మోహ‌రించారు.

అరెస్టులు అప్రజాస్వామికం

కాంగ్రెస్ నేత‌ల అరెస్టులు అప్ర‌జాస్వామికం అని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయన్నారు. కేంద్రం.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతుండ‌గా, రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు సామాన్యుల పాలిట శాపంగా మారిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరితో ధాన్యం కొనుగోళ్లలో గందరగోళం ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార‌న్నారు.

మీరు రోడ్లు దిగ్బంధం చేయొచ్చు కానీ మేము ధర్నాలు చేయొద్దా అని ప్ర‌శ్నించారు. ప్రభుత్వాల అసమర్థనను కప్పి పుచుకోవడానికి బీజేపీ, టిఆర్ఎస్ లు ఒకరి పై ఒకరు ఉద్యమాలు చేస్తున్నారు. రోడ్లపైకి వస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయడం మా బాధ్యత, హక్కు అని చెప్పారు. ప్రతిపక్షాల గొంతు నుములుతూ నిరసన వ్యక్తం చేసే హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షులతో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు, ముఖ్య నాయకులను కాంగ్రెస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాన‌ట్లు తెలిపారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలన్నారు.

Next Story