Telangana: కాంగ్రెస్ గెలిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: డీకే శివకుమార్
తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుందని డీకే శివకుమార్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 2:30 PM GMTTelangana: కాంగ్రెస్ గెలిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: డీకే శివకుమార్
తెలంగాణలో ఎన్నికల ప్రచారం వాడీ వేడీగా కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థుల కోసం జాతీయ నాయకలు వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ రెండో విడత విజయభేరి బస్సు యాత్ర మొదలుపెట్టింది. వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి ఈ యాత్ర ప్రారంభం కాగా.. ఇందులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో ఇచ్చిన ఐదు గ్యారెంటీలను కాంగ్రెస్ అమలు చేస్తోందని వెల్లడించారు. అనుమానం ఉంటే సీఎం కేసీఆర్ కర్ణాటకకు వచ్చి చూసుకోవచ్చని చెప్పారు. అయితే.. తెలంగాణ ప్రజల మీద ప్రేమతోనే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పట్ల ప్రజలు కృతజ్ఞత చూపాలని అన్నారు డీకే శివకుమార్. దేశంలో పేద ప్రజల కోసం ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్సే అని చెప్పారు.
కర్ణాటకలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు డీకే శివకుమార్. అలాగే గృహలక్ష్మి పథకం ద్వారా 1.10 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.2వేలు ఇస్తున్నామన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు 10 కిలోల సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. కర్ణాటకలో మహిళలు అందరూ ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఏదైనా హామీ ఇస్తే తప్పకుండా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. కానీ కేసీఆర్ అలా కాదంటూ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనె కేసీఆర్ విస్మరించారని అన్నారు. అయితే.. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే కర్ణాటకలో లాగే ఇక్కడ కూడా మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తుందని వెల్లడించారు.
ఇక ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణలో ఎక్కడా రైతులకు 24 గంటల కరెంటు అందడం లేదన్నారు. కేవలం 8 నుంచి 9 గంటలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌కు ఔటర్ రింగ్‌రోడ్డు, మెట్రో రైలు తెచ్చింది, మత సామరస్యాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. ఐదేళ్ల పాలనలో రుణమాఫీ పూర్తి చేయలేదంటూ కేసీఆర్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక యువత ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు.