గిగ్‌ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్‌ గుడ్‌న్యూస్‌

ఆరోగ్యశ్రీ పథకం కింద క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ, రూ.10 లక్షల వరకు వైద్యం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

By అంజి  Published on  24 Dec 2023 6:47 AM IST
Telangana, CM Revanth Reddy, health cover, gig workers, auto drivers

గిగ్‌ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్‌ గుడ్‌న్యూస్‌

హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీతోపాటు రూ.10 లక్షల వరకు వైద్యం అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కుక్క వెంటాడి బిల్డింగ్ పై నుంచి పడి మృతి చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఓలా తరహాలో టీ-హబ్‌ అభివృద్ధి చేస్తున్న యాప్‌ను అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

డిసెంబర్ 23, శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వారి వృత్తిలో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను అడిగి తెలుసుకున్నారు. కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. సామాజిక భద్రత కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.

అసంఘటిత కార్మికులకు ఉద్యోగాలు, సామాజిక భద్రత కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ దిశగా ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పారు. రాజస్థాన్‌లో ప్రస్తుతం ఉన్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసి తదుపరి రాష్ట్ర బడ్జెట్ సెషన్‌లో సమర్థవంతమైన చట్టాన్ని ప్రవేశపెడుతుందని రేవంత్ హామీ ఇచ్చారు.

నాంపల్లిలో గిగ్ కార్మికులు, ఆటో డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.

''లాభాలపై దృష్టి పెట్టడమే కాకుండా.. కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై కూడా సంస్థలు శ్రద్ధ వహించాలి. ఇచ్చిపుచ్చుకునే విధానాన్ని అనుసరించడంలో విఫలమైన ఏ పెద్ద సంస్థపైనైనా కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడదు. నాలుగు నెలల క్రితం ఓ స్విగ్గీ కుర్రాడు కుక్క వెంటాడడంతో భవనంపై నుంచి పడి చనిపోయాడు. మృతుల కుటుంబాలకు గత ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించాలి. కుటుంబ వివరాలను సేకరించి సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రూ.2 లక్షల సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాను'' అని అన్నారు.

క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్లు తమ దరఖాస్తులను డిసెంబర్ 28 నుండి జనవరి 6, 2024 వరకు నిర్వహించే గ్రామసభలలో డిజిటల్ ఫార్మాట్‌లో లేదా మాన్యువల్‌గా సమర్పించాలని ఆయన సూచించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌ చౌదరి, మన్సూర్‌ అలీఖాన్‌, మధు యాష్కీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఇతర నేతలు పాల్గొన్నారు.

Next Story