శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని సీతారాముల కల్యాణోత్సవానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణి గీతతో కలిసి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి వారిని దర్శించుకుని వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ మేరకు సీఎం దంపతులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.
భద్రాచలంలో అభిజిత్ సుముహుర్తమున శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. అశేష భక్త జనులతో మిథిలా స్టేడియం రామనామ స్మరణతో మారుమోగుతోంది పోటెత్తింది. కాగా కల్యాణ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున చైర్మన్ బీఆర్ నాయుడు భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కళ్యాణోత్సవానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతులు, సీఎస్ శాంతికుమారి దంపతులు హాజరయ్యారు. అదేవిధంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సరేఖ , సీఎస్ శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్వి శైలజా రామయ్యార్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.