ఢిల్లీ గద్దెపై ఎప్పుడూ మీరే ఉండరు, వారి ధర్మబద్ద కోరిక నెరవేర్చండి: సీఎం రేవంత్

బీసీల ధర్మబద్ద కోరిక అయిన 42 శాతం రిజర్వేషన్లను నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik
Published on : 2 April 2025 3:33 PM IST

Telangana, CM Revanthreddy, BC Groups Protest, Delhi Jantar Mantar, BC Reservation

ఢిల్లీ గద్దెపై ఎప్పుడూ మీరే ఉండరు, వారి ధర్మబద్ద కోరిక నెరవేర్చండి: సీఎం రేవంత్

బీసీల ధర్మబద్ద కోరిక అయిన 42 శాతం రిజర్వేషన్లను నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వేదికగా బీసీ సంఘాల ధర్నాలో పాల్గొన్న సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీసీల గొంతుక వినిపించడానికే కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. జనాభా తెలియకుంటే రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదని కోర్టులు చెప్పాయని, స్థానిక సంస్థలు, చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా తేలాలని కోరారు. రిజర్వేషన్ల అంశాన్ని రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకువచ్చామని, రిజర్వేషన్ల అంశానికి శాశ్వత పరిష్కారం లభించాలని రాహుల్‌గాంధీ చెప్పారని అన్నారు. జనగణనతో పాటు కులగణన చేపట్టాలని, దామాషా ప్రకారం నిధులు, నియామకాలు చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకున్నదని, అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్‌గాంధీ చెప్పారని అన్నారు. బలహీనవర్గాల లెక్క తేల్చాలని మొరార్జీ దేశాయ్‌ మండలి కమిషన్‌ ఏర్పాటు చేశారని, 52 శాతం బలహీనవర్గాలకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మండలి కమిషన్‌ చెప్పిందని తెలిపారు.

బీసీల రిజర్వేషన్లకు కేంద్రంలోని బీజేపీ సిద్ధంగా లేదు. మండల్ కమిషన్‌కు వ్యతిరేకంగా బీజేపీ యాత్ర చేసింది. 2025 వచ్చినా జనాభా లెక్కలు తేల్చడం లేదు. బీజేపీ కుట్ర చేసి జనగణన వాయిదా వేస్తూ వచ్చింది..అని సీఎం రేవంత్ ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ కులగణన చేయలేదని, దేశ రాజకీయాలకు దిక్సూచిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, ప్రభుత్వ పాలన, రాష్ట్ర అభివృద్ధిలో బలహీనవర్గాలు భాగస్వాములు కావాలని అన్నారు.

రిజర్వేషన్లు పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, అన్ని పార్టీలను సమన్వయం చేసుకుని అసెంబ్లీలో తీర్మానం చేశామని అన్నారు. రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరట్లేదని, తెలంగాణలో బలహీవర్గాలకు రిజర్వేషన్లు ఇస్తే మోదీకి కష్టమేంటని ప్రశ్నించారు. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుకుంటామని తీర్మానం పంపితే స్పందించలేదని, ప్రధాని తమ ఆలోచనలు పంచుకుంటే గౌరవం ఉంటుందని అన్నారు. గుజరాత్‌లో గుంట భూమి అడగడం లేదు. మా దగ్గర బలహీన వర్గాల లెక్క ఉంది. ఆమోదం తెలపాలని అడుగుతున్నాం. బీసీ బిల్లుకు ఆమోదం తెలపండి. 10 లక్షల మందితో రాష్ట్రంలో సభ ఏర్పాటు చేసిన సన్మానం చేస్తాం. ఢిల్లీ గద్దెపై ఎప్పుడూ మీరే ఉంటారని అనుకోవద్దు..అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు.

Next Story