తెలంగాణ రైజింగ్-2047కు కేంద్రం సహకారం అవసరం: సీఎం రేవంత్
వికసిత్ భారత్ కు అనుగుణంగా 'తెలంగాణ రైజింగ్ 2047' అనే నినాదంతో మా రాష్ట్ర కార్యచరణ పథకాన్ని సమర్పిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
By Knakam Karthik
తెలంగాణ రైజింగ్-2047కు కేంద్రం సహకారం అవసరం: సీఎం రేవంత్
వికసిత్ భారత్ కు అనుగుణంగా 'తెలంగాణ రైజింగ్ 2047' అనే నినాదంతో మా రాష్ట్ర కార్యచరణ పథకాన్ని సమర్పిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడిన సీఎం.. మా ఆకాంక్షలు, దృఢ సంకల్పానికి ఈ రోడ్డు మ్యాప్ ప్రతిబింబం అన్నారు. ఇంత సాహసోపేతమైన మార్పును సాధించాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం, భాగస్వామ్యం అత్యంత అవసరం. ఈ విషయంలో సహకార సమాఖ్య స్ఫూర్తితో కలిసి పని చేయాలని మేం ఆకాంక్షిస్తున్నామని చెప్పారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సమగ్ర, స్థిరమైన అభివృద్ధితోనే వికసిత్ భారత్ సాకారం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ పురోభివృద్ధి ప్రతి రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతం అభివృద్ధితో ముడిపడి ఉంటుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆయా ప్రాంతాలకు మద్దతుగా నిలవడంతో పాటు ఆయా రాష్ట్రాల సామర్థ్యాలను ఉపయోగించుకోవడం అత్యవసరం అన్నారు. వెనుకబడిన రాష్ట్రాలకు అవసరమైన ప్రతి సహాయాన్ని అందించాలని జాతీయ వృద్ధిలో సమతుల్యత చాలా కీలకం అన్నారు. ఈ రోజు మనం చేసే చర్చలు దేశ ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై దీర్ఘకాల ప్రభావం చూపుతాయని చెప్పారు.
ట్రిలియన్ డాలర్ల డీఎస్ డీపీ సాధించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. జాతీయ స్థాయి అంచనాల ప్రకారం ఈ లక్ష్యం 15 ఏళ్లలో సాధ్యమవుతుందని భావిస్తున్నాం. కానీ ఈ వచ్చే పదేళ్లలోనే ఈ లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పంతో తెలంగాణ ఉందన్నారు. ఇది కేవలం కోరిక మాత్రమే కాదని వ్యూహాత్మక ప్రణాళిక, స్పష్టమైన దిశతో ముందుకు సాగుతున్న లక్ష్యం అన్నారు. ప్రతి ఆరేళ్లకు ఒక సారి మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని రెట్టింపు చేసే సామర్థ్యాన్ని మేం స్థిరంగా కొనసాగించామని ఇదే ఊపుతో ప్రస్తుత దశాబ్దంలోనే మా జీఎస్ డీపీని ఐదు రెట్లు విస్తరించడంపై దృష్టి సారించామన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 లో మహిళా సాధికారత కీలకం అని అందుకే మా ప్రభుత్వం మహిళా స్వావలంబన, పెట్టుబడులు, చలనశీలత, ఆర్థికాభివృద్ధిని దన్నుగా నిలిచే పథకాలను రూపొందించామన్నారు.