తెలంగాణ రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా మరియు ఆరోగ్య భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కొత్తగా నిర్మించిన ఒక ప్రైవేట్ ఆసుపత్రిని మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను సవాలుగా తీసుకున్నామని, పేదలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించగలిగితే 90 శాతం సమస్యలు పరిష్కారమవుతాయని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు డిజిటల్ హెల్త్ కార్డుల జారీ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని వెల్లడించారు.
గడిచిన రెండేళ్లలో రాజీవ్ ఆరోగ్యశ్రీ మరియు సీఎమ్ఆర్ఎఫ్ ద్వారా రూ.1,800 కోట్లు పేదల వైద్యం కోసం ఖర్చు చేశామని, ఉస్మానియా, నిమ్స్ మరియు వివిధ ప్రాంతాల్లోని టిమ్స్ ఆసుపత్రులలో సుమారు రూ.10,000 కోట్లతో 10 వేల పడకల సామర్థ్యాన్ని పెంచుతున్నామని సీఎం వివరించారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తూ, వచ్చే విద్యా సంవత్సరం నుండి నర్సరీ నుంచి 12వ తరగతి వరకు 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్' విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో పాటు కార్పొరేట్ తరహాలో ఉచితంగా లేదా రాయితీతో రవాణా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.