'మహిళలకు 60 సీట్లు ఇచ్చే బాధ్యత నాదే' : సీఎం రేవంత్
త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్ రాబోతుంది, వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik
అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు..60 సీట్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటా: సీఎం రేవంత్
త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్ రాబోతుంది, వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వన మహోత్సవం-2025ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఓ రుద్రాక్ష మొక్కను నాటి అనంతరం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతోన్న వన మహోత్సవంతో తెలంగాణ హరిత వనం కావాలని ఆక్షాంక్షించారు. మనం చెట్టును కాపాడితే.. చెట్టు మనల్ని కాపాతుందని అన్నారు. ఈ ఏడాది 18.03 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
తల్లులు మొక్కలు నాటితే పిల్లలను చూసుకున్నట్లే చూసుకుంటారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి తల్లి తమ ఇంట్లో రెండు చెట్లను పెంచాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మహిళలను కోటీశ్వరులగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టామని, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో మహిళల చేత ఇందిరా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయించామని అన్నారు. మహిళ సంఘాల చేత బస్సులు కోనుగోలు చేయించి..ఆర్టీసీలో అద్దెకు తీసుకున్నామని వివరించారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల్లో కోటి మంది మహిళలను చేర్చాలేని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, అసైన్డ్ భూములు, పోడు భూములు పట్టాలు ఇచ్చిన ఘనత ఒక్క ఇందిరా గాంధీకే దక్కిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు తేవడం వల్లే నేడు గద్వాల విజయలక్ష్మి, శ్రీలతలు మేయర్, డిప్యూటీ మేయర్ అయ్యారని అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్ రాబోతున్నాయని 153కు పెరగబోయే సీట్లలో 51 సీట్లుకు అదనంగా మరో తొమ్మిది సీట్లు కలిపి మొత్తం 60 ఎమెల్యే సీట్లు మహిళలకు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.