సీఎంలు ఆ మూడుశాఖలే వారి దగ్గర పెట్టుకుంటారు..కానీ నేను: సీఎం రేవంత్
రవీంద్రభారతిలో గురుపూజోత్సవం-2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నేను ఉంటే విద్యా శాఖ బాగుపడుతుందనో, పేద పిల్లలు బాగుపడుతారనో కొందరు నాపై విమర్శలు చేస్తున్నారు.
By Knakam Karthik
సీఎంలు ఆ మూడుశాఖలే వారి దగ్గర పెట్టుకుంటారు..కానీ నేను: సీఎం రేవంత్
హైదరాబాద్: ముఖ్యమంత్రులు చాలా మంది రెవెన్యూ, ఆర్ధిక శాఖ, నీటిపారుదల శాఖలని వారి దగ్గర పెట్టుకుంటారు. కానీ నేను మీ సోదరుడిగా విద్య శాఖను నా దగ్గర పెట్టుకున్నా, నేనే స్వయంగా విద్యా శాఖను పర్యవేక్షిస్తున్నా..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్రభారతిలో గురుపూజోత్సవం-2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నేను ఉంటే విద్యా శాఖ బాగుపడుతుందనో, పేద పిల్లలు బాగుపడుతారనో కొందరు నాపై విమర్శలు చేస్తున్నారు. విద్యా శాఖ ఇంకెవరికైనా ఇవ్వాలని విమర్శిస్తున్నారు. విమర్శకులకు నేను ఒకటే చెబుతున్నా . విద్యా శాఖలో సమస్యలు అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. పదేళ్లలో విద్యా శాఖ అస్తవ్యస్తమైంది. కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పి పదేళ్లు గడిచింది.. మరి అది అమలు జరిగిందా అనేది మీరే ఆలోచించుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో ప్రతీ పల్లెకు జై తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఉపాధ్యాయులే. ఆనాడు బడికి వచ్చే పిల్లల్నే కాదు తల్లిదండ్రులను ప్రభావితం చేసి ఉద్యమం వైపు నడిపించింది ఉపాధ్యాయులే. పదేళ్లుగా టీచర్ల బదిలీలు జరగలేదు. 2017 నుంచి టీచర్ల నియామకాలు జరగలేదు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేవలం 55 రోజుల్లో 11 వేల టీచర్ల నియామకాలు పూర్తి చేశాం. డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలన్న ఆలోచన ఆనాటి పాలకులకు ఎందుకు రాలేదు. విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చుకుని ఆధిపత్యం చెలాయించాలని ఆనాటి పాలకులు ప్రయత్నించారు. ప్రొఫెసర్లను నియమించకుండా యూనివర్శిటీలను నిర్వీర్యం చేశారు..అని సీఎం పేర్కొన్నారు.
ఉస్మానియా, కాకతీయ వైభవాన్ని కోల్పోయె పరిస్థితి ఆనాడు తీసుకొచ్చారు. మీ ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది . మీ సంఘాలు ఎప్పుడు వచ్చినా సమస్యలు విని పరిష్కరించే ప్రయత్నం చేశాం. ఎక్కడైనా కొంత ఆలస్యం కావచ్చు కానీ సమస్య పరిష్కరించకుండా ఉండలేదు. తెలంగాణ పునర్నిర్మాణంలో మీ సేవలు అవసరం. తెలంగాణలో 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న 10 వేల పాఠశాలల్లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువ విద్యావంతులు, సామాజిక బాధ్యత తెలిసినవారు. టీచర్లకు జీతాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు.. మౌళిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకే అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో స్వయం సహాయక సంఘాలకు నిర్వహణ బాధ్యత అప్పగించాం. ప్రతీ ఏటా 130 కోట్లు స్కూల్స్ నిర్వహణకు నిధులు మంజూరు చేస్తున్నాం. చదువొక్కటే పేదల తల రాతను, రాష్ట్రం తలరాతను మారుస్తుంది. టీచర్లు అంటే ఒక కుటుంబ పెద్దగా భావించండి. పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన సమయంలో పిల్లలతో కలసి ఉపాధ్యాయులు భోజనం చేయండి. అప్పుడే తప్పులు జరగకుండా ఉంటాయి. గతంలో ప్రతీ ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గేది. కానీ మన ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 3లక్షలు పెరిగింది. ఇందులో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల కృషిని నేను అభినందిస్తున్నా. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా తీర్చిదిద్దుదామని ప్రతినబూనుదాం. విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుంది. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా మన విద్యార్థులను తీర్చిదిద్దుదాం..అని సీఎం వ్యాఖ్యానించారు.
తెలంగాణకు ఒక నూతన ఎడ్యుకేషన్ పాలసీ అవసరం. పేద పిల్లల జీవితాలను మార్చేలా ఆ పాలసీ ఉండాలి. అందుకే ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించేందుకు ఓకే కమిటీని నియమించాం . పునాది బలంగా ఉన్నప్పుడే ఎన్ని అంతస్తులైనా కట్టొచ్చు. విద్య విషయంలోనూ పునాది బలంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. పాఠశాల విద్యనే కాదు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచిస్తున్నా . వరల్డ్ బెస్ట్ మోడల్ గా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ను నిర్మిస్తున్నాం. నిరుద్యోగ యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. 65 ఐటీఐలను టాటా కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్ గా ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేశాం. దేశ ప్రతిష్టను పెంచేలా తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నాం. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయండి..గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలపై ఆసక్తి ఉన్న వారికి గుర్తించి ప్రోత్సహించండి. చదువుతోనే కాదు.. క్రీడల్లో రాణించినా మంచి భవిష్యత్ ఉంటుందని అవగాహన కల్పించండి. విద్యార్థులు డ్రగ్స్, గంజాయి లాంటి తప్పుదారిలో పడకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. తెలంగాణలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ ఫోర్స్ ను తీసుకొచ్చాం. విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు. ఆ భవిష్యత్తును మీ చేతుల్లో పెడుతున్నా.. మీరు, నేను కలిసి తెలంగాణను పునర్నిర్మించుకుందాం.. ఇందుకు అందరూ కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తున్నా..అని సీఎం రేవంత్ మాట్లాడారు.