పాదయాత్ర మొదలు పెట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్రను మొదలుపెట్టారు.
By Kalasani Durgapraveen Published on 8 Nov 2024 4:00 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్రను మొదలుపెట్టారు. యాదగిరిగుట్ట ఆలయంలో తన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం రంగారెడ్డి జిల్లా సంగెం నుంచి మూసీ నది పునరుద్ధరణ సంకల్ప పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, అనుచరులు, మంత్రులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట నుంచి హెలికాప్టర్‌లో రంగారెడ్డి జిల్లా సంగెంకు వచ్చి గ్రామంలోని చారిత్రక భీమలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం మధ్యాహ్నం వలిగొండ మండలం సంగెం నుంచి మూసీ పాదయాత్ర ప్రారంభించి మూసీ నదిలో నీటిని పరిశీలించారు.
ఇక అంతకు ముందు యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటీడీఏ) అధికారులతో ఆలయ పరిసరాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు రేవంత్ రెడ్డి. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా అధికారులకు తెలిపారు. టెంపుల్ బోర్డు ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. గోశాలలో గోసంరక్షణకు ప్రత్యేక పాలసీని తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. గోసంరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. కొండపై భక్తులు ఇబ్బందులు లేకుండా నిద్రపోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.