సినిమాల్లో మాత్రమే హీరో ఆపదలో ఉన్న వారిని రక్షిస్తూ ఉండడం చూస్తూ ఉంటాం. కానీ నిజజీవితంలో ఓ బాలుడు చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది అంతేకాదు ఆ బాలుని ప్రతి ఒక్కరూ అభినందించారు. ముఖ్యంగా సీఎం ఆ బాలుడిని తన వద్దకు పిలిపించుకొని అభినందించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నందిగామ శివారులోని ఓ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం నాడు భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదం నుంచి 50 మంది కార్మికులు ప్రాణాలతో బయట పడేందుకు సహకరించిన బాలుడు సాయి చరణ్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రమాదకర పరిస్థితిలో ఉన్న ఆరుగురు కార్మికుల ప్రాణాలను తాడు సాయంతో కాపాడిన సాయిచరణ్ ను సీఎం రేవంత్ ప్రత్యేకంగా అభినందించడంతో పాటు శాలువ కప్పి, పుష్ప గుచ్ఛం అందించి మెచ్చుకున్నారు.
తల్లిదండ్రులతో కలిసి సాయిచరణ్ సీఎంను కలిశారు. కార్మికులను కాపాడటంలో ప్రదర్శించిన తెగింపు వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. నందిగామకు చెందిన సాయిచరణ్ ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడు. అగ్ని ప్రమాదం వార్త తెలియగానే తన స్నేహితుడి తల్లి అదే పరిశ్రమలో పనిచేస్తుండడంతో సాయిచరణ్ అక్కడికి చేరుకున్నాడు. నాలుగో అంతస్తులో చిక్కుకున్న కొందరిని రక్షించాడు. అతడు చూపిన ధైర్యసాహసాలకు ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, డీసీపీ నారాయణరెడ్డి అభినందించారు.