తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీని ప్రారంభించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలు కూడా తినే రోజులు వచ్చాయని అన్నారు. రూ.1.90కే పేదలకు కిలో బియ్యం ఇవ్వాలని మొదట కోట్ల విజయభాస్కర్‌రెడ్డి భావించారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో రూ.2 కిలో బియ్యం పథకాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారు. పేదలకు బియ్యం ఇచ్చేందుకు 1957లోనే రేషన్‌కార్డు దుకాణాలు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు సన్నబియ్యం ఇస్తోంది..అని సీఎం అన్నారు.
అయితే, ఉచితంగా వచ్చిన బియ్యాన్ని ప్రజలు రూ.10కి అమ్ముకుంటున్నారు. మిల్లర్లు వాటిని కొని రీసైక్లింగ్ చేసి మళ్లీ రూ.50కి అమ్ముతున్నారు. పేదల నుంచి రేషన్ బియ్యాన్ని కొన్న మిల్లర్లు రూ.కోట్లలో దందా చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగవడంతో రాష్ట్ర ప్రజలు సన్న బియ్యానికి మొగ్గు చూపుతున్నారు. అందుకే ప్రజల ఆకాంక్ష మేరకు రేషన్ కార్డులపై సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టాం”అని సీఎం రేవంత్ అన్నారు.