అమెరికాలో మరో యూనివర్సిటీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
అమెరికాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 10 Aug 2024 12:22 PM GMTఅమెరికాలో మరో యూనివర్సిటీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
అమెరికాలో సీఎం రేవంత్‌రెడ్డిపర్యటన కొనసాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన టూర్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటి వరకు దాదాపు 11 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ప్రముఖ కంపెనీల అధినేతలు, ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి డి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్ ఫోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది. తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రభుత్వం వారిని ఆహ్వానించింది. పరస్పరం అధునాతన పరిజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమాలతో పాటు ఉమ్మడిగా పరిశోధనలు నిర్వహించాలనే అభిప్రాయాలు ఈ సమావేశంలో వ్యక్తమయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వానికి తగిన సహకారం అందిస్తామని యూనివర్సిటీలోని బయోడిజైన్ విభాగం అధిపతులు డాక్టర్ అనురాగ్ మైరాల్, డాక్టర్ జోష్ మాకోవర్ ప్రకటించారు. తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖను అందించారు. భారీ వైద్య పరికరాల పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందని, దీంతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రస్తావించారు. వైద్య పరికరాల విద్య, కొత్త ఆవిష్కరణలకు తమ మద్దతు ఉంటుందని ఆ లేఖలో స్పష్టం చేశారు.