యాదాద్రి ఆలయం పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారు

Telangana CM KCR Yadadri Tour. యాదాద్రి ఆలయ పునఃప్రారంభ ముహూర్త తేదీని సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. యాదాద్రిలో 2022 మార్చి

By Medi Samrat  Published on  19 Oct 2021 8:06 PM IST
యాదాద్రి ఆలయం పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారు

యాదాద్రి ఆలయ పునఃప్రారంభ ముహూర్త తేదీని సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. యాదాద్రిలో 2022 మార్చి 28న మహాకుంభ సం‍ప్రోక్షణ ప్రారంభమవుతుందని కేసీఆర్‌ తెలిపారు. అంత‌కుముందు యాదాద్రి పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం కొండ కింద పూర్తయిన లక్ష్మీ పుష్కరిణి, కల్యాణ కట్ట, టెంపుల్ రింగ్ రోడ్ వెంట తిరుగుతూ, గిరి ప్రదక్షిణ మెట్ల దారి, గోపురం దగ్గర నిర్మాణాలను పరిశీలించారు. తుది పనులపై పలు మార్పులు సూచించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ టెంపుల్ సిటీ నిర్మాణ పనులను సీఎం పర్యవేక్షించారు.

అనంత‌రం మాట్లాడుతూ.. మార్చి 28న మహాకుంభ సం‍ప్రోక్షణ ప్రారంభమవుతుందని.. తొమ్మిది రోజుల ముందు మహా సుదర్శన యాగంతో ఈ కార్య‌క్ర‌మానికి అంకురార్పణ చేయనున్నట్లు పేర్కొన్నారు. స్వామి వారి విమాన గోపురాన్ని స్వర్ణతాపడం చేయించబోతున్నామని.. ఇందుకు 125 కిలోల బంగారం అవసరమవుతుంద‌ని అన్నారు. 10 వేల మంది రుత్వికులతో మహా సుదర్శన యాగం నిర్వహించనున్నట్లు, చిన్నజీయర్‌ స్వామి పర్యవేక్షణలో ఈ యాగం కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉందని సీఎం అన్నారు. రాష్ట్రంలోని విశిష్ట పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒకటని కొనియాడారు.

ఇక 250 ఎకరాల్లో విస్తరించి ఉండే ఈ టెంపుల్ సిటీలో 50 ఎకరాల్లో పచ్చదనం, మిగతా 200 ఎకరాల్లో 250 కాటేజీల నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. సుమారు 800 నుంచి 1000 గజాల విస్తీర్ణంలో నిర్మించే ఒక్కో కాటేజీలో మొత్తం 4 సూట్లు ఉంటాయన్నారు. దాతల నుంచి విరాళాలు సేకరించిన ధనంతో వైటీడీఏ ఈ కాటేజీలను నిర్మిస్తుందన్నారు. దాతలు సూచించిన పేరును ఆ కాటేజీకి పెట్టుకోవచ్చన్నారు. మొత్తంగా దాదాపు వెయ్యి కుటుంబాలు బస చేసే ఈ సూట్లలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

కాటేజీలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సరిపడా నీళ్లు, నిరంతర విద్యుత్తు, అన్నిరకాల వసతులు, హంగులు సమకూర్చాలని సీఎం ఆదేశించారు. యాదాద్రి పవిత్రతను కాపాడటానికి అందరూ సహకరించాలని, టెంపుల్ సిటీ పరిధిలో మద్యపానం, ధూమపానం నిషేదాన్ని కఠినతరంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇక్కడ కేవలం శాఖాహారాన్ని మాత్రమే అనుమతించాలని సీఎం కేసీఆర్ సూచించారు.


Next Story