చైనా సరిహద్దులోని గాల్వన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్లను ఆదుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఇచ్చిన మాట ప్రకారం అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు సీఎం కేసీఆర్ నేడు(శుక్రవారం) జార్ఖండ్ వెళ్లనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్.. అక్కడి నుంచి నేరుగా జార్ఖండ్ వెళ్లి.. ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్‌తో భేటీకానున్నారు. అనంతరం రూ.10 లక్షల చెక్కులను జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు అందజేయనున్నారు.
చైనా సరిహద్దులోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది సైనికులు వీర మరణం చెందిన సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణకు చెందిన సంతోష్ బాబు ఒకరు. ఆ సమయంలో సీఎం కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబానికి రూ. 5 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించారు. మిగతా 19 మంది సైనికులకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు జార్ఖండ్ వెళ్లి ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం మిగిలిన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఆయా రాష్ట్రాలకు సీఎం వెళ్లనున్నారు.