నా ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు.. సీఎం కేసీఆర్‌

Telangana CM KCR Rajanna Sircilla Tour.ఆదివారం సీఎం కేసీఆర్ రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో ప‌ర్య‌టించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 July 2021 6:30 PM IST
నా ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు.. సీఎం కేసీఆర్‌

ఆదివారం సీఎం కేసీఆర్ రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సిరిసిల్లలో సకల సౌకర్యాలతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని, సర్దాపూర్‌లో మార్కెట్‌యార్డు, గిడ్డంగులను, సిరిసిల్లలో నర్సింగ్‌ కళాశాలను, మండేపల్లిలో ఐడీటీఆర్‌ శిక్షణ కేంద్రాన్ని. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. తన ప్రస్థానాన్ని, ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ఇక ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పాటు కాక‌ముందు తెలంగాణ వారికి ఏదీ చేత‌కాద‌ని కొంత‌మంది దుర్మార్గంగా వాదించారు.కానీ చిత్త‌శుధ్ది, ల‌క్ష్య‌శుద్ది, వాక్‌శుద్ది ఉంటే ఏదైనా సాధ్య‌మ‌వుతుంద‌ని ఈ రోజు నిరూపించామ‌న్నారు. ఒక ల‌క్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించే దిశ‌గా వెలుతున్న‌ట్లు చెప్పారు.

అనంతరం కలెక్టరేట్‌ భవనంలో జరిగిన సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడుతూ.. సభాధ్యక్షులు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, వేదికను అలంకరించిన గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌, సభలో ఆసీనులైన అందరికీ నమస్కారం తెలిపారు. రాజన్న సిరిసిల్ల ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు తాను హృదయపూర్వక అభినందలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

గ‌తంలో ఇచ్చిన హామీ ప్ర‌కారం వృద్దాప్య ఫించ‌ను ఇస్తామ‌న్నారు. వ‌చ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య ఫించ‌న్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. 'మిషన్ కాకతీయ కారణంగా భూగర్భ జలాలు పెరిగాయి. తెలంగాణలో నీళ్ల కోసం 500-600 మీటర్లు లిఫ్ట్‌ చేయాలని ప్రధాని అంటే.. నేను తీవ్రంగా వ్యతిరేకించా. తెలంగాణలో 50 మీటర్లు లిఫ్ట్ చేస్తే నీళ్లు వస్తాయని ప్రధానికి చెప్పా. కాళేశ్వరం పూర్తవుతుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఇప్పుడు అద్భుతంగా కళ్లముందు కనిపిస్తోంది. డిస్కవరీలో కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రసారం చేశారని' సీఎం కేసీఆర్ చెప్పారు.

'ఒక్కో చేనేత కార్మికుడికి రూ.5 లక్షల చొప్పున బీమా కల్పిస్తాం. రూ.10 వేల కోట్లతో మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తాం. తెలంగాణలో కొత్తగా 13 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్‌ పెంచుతున్నాం. మొద‌టి సంవ‌త్స‌రం న‌ర్సింగ్ విద్యార్థుల‌కు రూ.5వేలు. రెండో సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు రూ.6వేలు, మూడో సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు రూ.7వేలు స్టైపండ్ ఇస్తాం. వ‌చ్చే విడుత‌లో ఖ‌చ్చితంగా వైద్య క‌ళాశాల వ‌స్తుంది. జిల్లాకు ఇంజినీరింగ్ క‌ళాశాల కూడా మంజూరు చేస్తాం. త్వ‌ర‌లోనే రాజ‌న్న ఆల‌యం స్థాయిని పెంచేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తాం.' అని ముఖ్య‌మంత్రి తెలిపారు.

Next Story