సీఎం కేసీఆర్‌కు వైరల్‌ ఫీవర్‌.. ప్రగతి భవన్‌లోనే చికిత్స

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జ్వరం బారిన పడ్డారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

By అంజి  Published on  27 Sep 2023 1:52 AM GMT
Telangana, CM KCR, viral fever, KTR

సీఎం కేసీఆర్‌కు వైరల్‌ ఫీవర్‌.. ప్రగతి భవన్‌లోనే చికిత్స

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జ్వరం బారిన పడ్డారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారని, కొద్దిరోజుల్లో ఆయన కోలుకోవాలని ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్‌ మంగళవారం రాత్రి సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ వేదికగా తెలిపారు. సీఎం చంద్రశేఖర్ రావు (69)కి ఆయన వైద్య బృందం ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారని, నిశితంగా పర్యవేక్షిస్తున్నారని కేటీఆర్‌ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో తెలిపారు. "డాక్టర్ల ప్రకారం అతను కొద్ది రోజుల్లో సాధారణ స్థితికి చేరుకోగలడు" అని పాలక బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్‌ అన్నారు. సీనియర్‌ వైద్యుడు ఎంవీ రావు ఆధ్వర్యంలో ఐదుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది.

కొద్దిరోజుల్లోనే కేసీఆర్‌ సాధారణ స్థితికి చేరుకుంటారని, ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వైరల్ జ్వరాలు తీవ్రంగా నమోదవుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిమ్స్ తో పాటు నగరంలోని పలు ఆస్పత్రులకు జ్వరాలతో జనం క్యూకట్టారు. ఇటీవల వర్షాలు, వాతావరణంలో మార్పులతో వైరల్ ఫీవర్లు పెరుగుతున్నాయని వైద్యులు అంటున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Next Story