బోయిగూడ ఘటనలో 11కి చేరిన మృతుల సంఖ్య.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
Telangana CM KCR announces Rs 5 lakh ex gratia Bhoiguda victims.సికింద్రాబాద్‌లోని బోయిగూడలో భారీ అగ్నిప్రమాదం
By తోట వంశీ కుమార్ Published on 23 March 2022 4:44 AM GMTసికింద్రాబాద్‌లోని బోయిగూడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టింబర్, తుక్కు(స్ర్కాప్) గోదాంలో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 11 మంది సజీవ దహనం అయ్యారు.
వివరాల్లోకి వెళితే.. బోయిగూడ ఐడీహెచ్ కాలనీలోని స్ర్కాప్ దుకాణంలో పని పూర్తి అయిన అనంతరం కార్మికులంతా తమ గదుల్లో నిద్రపోయారు. తెల్లవారుజామున మంటలు రాజుకున్నాయి. కట్టెలు, వైర్లు ఎక్కువగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అదుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు గంట పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
గోడౌన్‌పై అంతస్తులో రెండు గదులు ఉన్నాయి. అక్కడ పనిచేసే కార్మికులు ఈ రెండు గదుల్లోనే నివసిస్తారు. కిందకు వెళ్లేందుకు ఇనుప మెట్ల మార్గం ఒకటే ఉంది. దీంతో వారు కిందకు వెళ్లే మార్గమే లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవ దహనం కాగా.. మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. మృతులంతా బీహర్‌కు చెందిన వలస కార్మికులు. అగ్ని ప్రమాదంలో చనిపోయినవారిని బిట్టు(23), సికిందర్(40), సత్యేందర్(35), గోలు(28), దామోదర్(27), రాజేశ్(25), దినేశ్(35), రాజు(25), చింటు(27), దీపక్(26), పంకజ్(26) గా గుర్తించారు. ప్రేమ్, అనే మరో ఇద్దరు యువకులు గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందతున్నారు.
అగ్నిప్రమాదం జరిగిన భవనంలో టింబర్ డిపో, స్క్రాప్ గోదాం ఉన్నాయని పోలీసులు తెలిపారు. టింబర్ డిపో నుంచి స్క్రాప్ గోదాముకు మంటలు వ్యాపించాయన్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఘటనాస్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటన చాలా బాధకరమన్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించామన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుని తెలిపారు.
సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి..
ఈ అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతదేహాలను బీహార్‌కు పంపించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు.