కెనడాలో జరుగుతున్న ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన చికిత తానిపర్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం సీఎంవో ఆఫీస్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్చరీ అండర్ 21 కేటగిరీ ఫైనల్‌లో కొరియాకు చెందిన పార్క్ యెరిన్‌పై విజయం సాధించి స్వర్ణం చేజిక్కించుకుని చికిత వరల్డ్ చాంపియన్‌గా నిలవడం దేశానికే గర్వకారణమని సీఎం తెలిపారు.
జీవితంలో విజయం సాధించాలని కోరుకునే యువత అందరికీ ఆమె స్ఫూర్తిదాయకంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె తెలంగాణలోని గ్రామీణ నేపథ్యం నుండి వచ్చినప్పటికీ, ఆమె ఉన్నత లక్ష్యాలను సాధించి, ఆత్మవిశ్వాసం, దృష్టి, దృఢ సంకల్పంతో తన లక్ష్యాన్ని సాధించింది. చిన్నప్పటి నుంచి ఆమె ప్రతిభను గుర్తించి, దానిని పెంపొందించినందుకు చికిత తల్లిదండ్రులను ఆయన అభినందించారు. భవిష్యత్తులో చికిత మరిన్ని పురస్కారాలు, గుర్తింపు పొందాలని సీఎం ఆకాంక్షించారు.