తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లికి వెళ్లనున్నారు. అక్కడ ఒక ఎకరంలో ‘స్మృతివనం’కు శంకుస్థాపన చేసి, కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయంలో ప్రార్థనలు చేయనున్నారు. 1981లో ఆదివాసీలపై జరిగిన దారుణ హత్యాకాండ తర్వాత ఇంద్రవెల్లిలో పర్యటించనున్న తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలవనున్నారు. ఈ పర్యటన ద్వారా లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టనున్నారు. ‘స్మృతివనం’ నిర్మాణం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ చేసిన వాగ్దానమని, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారుల నుండి అవసరమైన అనుమతులు రావడంతో ఇప్పుడు నిర్మాణం జరుగుతూ ఉంది.
1981, ఏప్రిల్ 20న భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం.. మా ఊళ్లో మా రాజ్యం అన్న నినాదంతో ఆదివాసీ రైతు కూలీ ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో పోలీసు బలగాలు ఉద్యమకారులపై తూటాల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో ఎందరో ఆదివాసీ గిరిజనులు అమరులయ్యారు. గత నాలుగు దశాబ్దాలుగా ఇంద్రవెల్లి ఘటన ఆదివాసీల గుండెల్లో మాయని గాయంగా ఉంది. ఈ ఘటనలో కేవలం 13 మందే మరణించారని అప్పటి ప్రభుత్వం ప్రకటించినా.. ఎంతో మంది ఆదివాసీ గిరిజనుల ప్రాణాలు గాలిలో కలిశాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.