తెలంగాణలో 2027 జనాభా గణన ప్రక్రియను పూర్తి డిజిటల్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర జనాభా గణన కార్యకలాపాల డైరెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. గతంలో జరిగిన కాగితపు పద్ధతికి భిన్నంగా ఈసారి మొబైల్ యాప్‌లు, పోర్టల్స్ ద్వారా డేటా సేకరిస్తామని వెల్లడించారు. మే 11 నుండి జూన్ 9 వరకు మొదటి దశలో గృహ గణన చేపడతామని, 2027 ఫిబ్రవరిలో రెండో దశ గణన ఉంటుందని పేర్కొన్నారు. ఈ భారీ ప్రక్రియ కోసం రాష్ట్రంలో సుమారు 88,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు.
డేటా భద్రతకు పెద్దపీట వేస్తూ, సిబ్బంది తమ డివైజ్‌లలో డేటా అప్‌లోడ్ చేయగానే అది సర్వర్‌కు చేరుతుందని, స్థానికంగా ఏ సమాచారం ఉండదని ఆమె స్పష్టం చేశారు. అలాగే, పౌరులు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' సదుపాయాన్ని ఏప్రిల్ 16 నుండి మే 10 వరకు అందుబాటులో ఉంచుతామన్నారు. కుల గణన విషయానికొస్తే.. మొదటి దశలో ఇంటి యజమాని కులాన్ని, రెండో దశలో మిగిలిన కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తామని వివరించారు. మొదటి దశలో దేశవ్యాప్తంగా ఒకే రకమైన 33 ప్రశ్నలు అడుగుతారని, ఎవరైనా మిగిలిపోతే సంప్రదించడానికి త్వరలోనే హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ప్రకటిస్తామని తెలిపారు.