హైదరాబాద్: పలు కారణాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు సర్వేలో తమ పేరును ఎక్కడ నమోదు చేయించుకోవాలనే దానిపై అయోమయం నెలకొంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికి డోర్ నంబర్, యజమాని పేరు మాత్రమే నమోదు చేస్తున్నారు. ఎల్లుండి నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం కానుంది. ఈ లోపు మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఉన్నతాధికారులు అంటున్నారు. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో కలెక్టర్లకు మార్గదర్శకాలు పంపిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆధార్‌లో అడ్రస్ ఉన్నచోటే వివరాలు నమోదు చేయించుకోవాలని సమాచారం.
ఒక్కో గణకుడికి 150 నుంచి 175 ఇళ్లు దాకా కేటాయించారు. రేపటి వరకూ ఇంటి నంబర్, యజమాని పేరు నమోదు ప్రక్రియ పూర్తి కానుంది. వీటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత.. ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబాలలోని సభ్యులందరి సమగ్ర వివరాలను నమోదు చేస్తారు. నమోదు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వివరాలు సేకరించినట్టుగా సర్వే ఆఫీసర్లు.. ఆయా ఇళ్లకు స్టిక్కర్లు అంటిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయని, ఇళ్లను 87,092 ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించినట్టు రాష్ట్ర ప్రణాళిక శాఖ తెలిపింది.