జనవరి 17వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (కేసీఆర్) అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభన్‌లో మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్ర సర్కార్ సెలవులు ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేబినెట్ భేటీలో కరోనా తదితర అంశాలపై చర్చించనున్నారని సమాచారం. రాష్ట్రంలో కరోనా తీవ్రత, నియంత్రణ చర్యలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఇదే విషయమై సంచలన ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని సమాచారం. కరోనా వైరస్ కట్టడి దిశగా చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే ఆంక్షలను జనవరి 20వ తేదీ వరకు పొడిగించింది. అలాగే స్కూళ్లు, కాలేజీలు తెరిస్తే.. అవి కరోనా హాట్ స్పాట్‌లగా మారే ఛాన్స్ ఉన్నందున సెలవులను పొడిగించారు. కాగా రేపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.