మ.2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం..లోకల్ ఎలక్షన్స్‌పై క్లారిటీ వచ్చే ఛాన్స్!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.

By Knakam Karthik
Published on : 10 July 2025 8:45 AM IST

Telangana, CM Revanthreddy, Cabinet Meeting, Local Elections,

మ.2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం..లోకల్ ఎలక్షన్స్‌పై క్లారిటీ వచ్చే ఛాన్స్!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు, రిజర్వేషన్ల ఖరారు, రాజీవ్ యువ వికాసం స్కీమ్, బనకచర్ల అడ్డుకోవడంపై స్టేట్ యాక్షన్ ప్లాన్, ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి, అడ్మిషన్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్లు, మెడికల్ కాలేజీల స్థితిగతులు, డ్రగ్స్ నియంత్రణ, సన్నబియ్యం పంపిణీ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన కేబినెట్‌ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపైనా సమీక్షించనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్‌లో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. సెప్టెంబరు 30 నాటికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలన్న హైకోర్టు, 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఇదివరకే ఆదేశించింది. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల దస్త్రం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మరో వైపు ఈ నెల 14న రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందున రేషన్ కార్డులు, బియ్యం పంపిణీపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. నాలుగు గోశాలలు నిర్మించేందుకు సిద్ధం చేసిన ప్రతిపాదనలపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గిగ్ వర్కర్ల సంక్షేమానికి రూపొందించిన ముసాయిదా బిల్లు, స్టాంప్‌ డ్యూటీ సవరణ ప్రతిపాదనలపైనా కేబినెట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. భూభారతి సదస్సులో వచ్చిన దరఖాస్తులను ఏ విధంగా పరిష్కరించాలనే అంశంపై సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

Next Story