ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం..మహిళలకు రూ.2500పై చర్చ!
ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik
ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం..మహిళలకు రూ.2500పై చర్చ!
ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో మహాలక్ష్మి పథకంలో భాగంగా 18ఏళ్లు దాటిన యువతులు, మహిళలకు నెలకు రూ.2,500 అందించే దానిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా అన్ని విభాగాల నుంచి కేబినెట్ సమావేశానికి నివేదికలు పంపించాలని సీఎస్ రామకృష్ణారావు అధికారులకు సూచించారు. అటు BC రిజర్వేషన్ ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండటంతో దానిపైనా చర్చించే అవకాశముంది.
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేశారు. అనంతరం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రారంభించారు. దాని తర్వాత రూ.500 లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. తాజాగా రాష్ట్రంలోని మహిళలకు రూ.2500 అందించే పథకం అమలుపై ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
కాగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే..మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం జమ చేసే ఈ స్కీమ్‌ను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు గణనీయమైన ఆర్థిక భరోసాను అందించడంతో పాటు, రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అదనపు బలాన్ని చేకూర్చనుంది.