తెలంగాణ కేబినెట్ భేటి వాయిదా.. ఢిల్లీకి వెళ్లాలని సీఎం నిర్ణయం

తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది.

By Srikanth Gundamalla  Published on  18 May 2024 8:30 PM IST
telangana, cabinet meeting, postponed, cm revanth reddy,

తెలంగాణ కేబినెట్ భేటి వాయిదా.. ఢిల్లీకి వెళ్లాలని సీఎం నిర్ణయం 

తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కేబినెట్ భేటీని వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా.. మే 18న శనివారం సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగాల్సిఉండగా.. దీనికి ఎలక్షన్ కమిషన్ అనుమతి నిరాకరించింది. అయితే.. మంత్రివర్గ సమావేశం నిర్వహించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈసీని అనుమతి కోరింది. రాత్రి ఏడు గంటలు దాటినా ఎలాంటి స్పందన రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు సీఎంఓ వర్గాలు విషయాన్ని వెల్లడించాయి.

మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన అజెండాను కూడా సీఎస్‌ ముందే సిద్ధం చేశారు. ఈసీ నుంచి అనుమతి వస్తుందేమో అని ఉత్కంఠ కొనసాగింది కానీ..వారు ఏమీ చెప్పలేదు. కొంత సమయం పాటు ఈసీ స్పందన కోసం ఎదురు చూసిన సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు సచివాలయం నుంచి తిరిగి వెళ్లిపోయారు. ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చినప్పుడే కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక 20వ తేదీ లోపు ఈసీ నుంచి అనుమతి రాకపోతే మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లి.. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారనీ తెలుస్తోంది. కాగా.. తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ఇంకా అమలులో ఉంది. మరోవైపు నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ కూడా ఈ నెల 27వ తేదీన ఉంటుంది. ఈ క్రమంలోనే ఈసీ కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.

Next Story