తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20న సమావేశం కానుంది.
By Medi Samrat Published on 14 Sept 2024 1:30 PM IST
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20న సమావేశం కానుంది. సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లిందని, ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని కోరారు. ఖమ్మం పట్టణానికి మున్నేరు వాగుతో ఉన్న వరద ముప్పును నివారించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే శాశ్వత పరిష్కారమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్రం నిధులు కేటాయించేలా చూడాలని, రాష్ట్రం తనవంతుగా నిధుల వాటాను భరించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించిన తర్వాత ఆదుకోవటం కంటే నివారణ చర్యలపై ఎక్కువ దృష్టి సారించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.