తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో దళితబంధు, ప్రభుత్వశాఖల్లో ఖాళీల భర్తీపై చర్చిస్తున్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఈ భేటీలో చర్చ జరిగే వీలుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టనున్న దళితబంధు పథకం మార్గదర్శకాలను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశముంది.
దీంతో పాటు దళితబంధును హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వరద నిర్వహణ బృందం ఏర్పాటు, ఉద్యోగ నియామకాలపై చర్చ జరిగే వీలుంది. కొత్త జోనల్ విధానం మేరకు కేడర్ వర్గీకరణ పూర్తి చేసిన అధికారులు.. సీఎం ఆదేశాల మేరకు ఆ వివరాలను సిద్ధం చేశారు. ఆర్థికశాఖ వీటన్నింటినీ క్రోడీకరించి సమగ్ర నివేదిక తయారు చేసింది. దీనిపైనా చర్చించనున్నారు. మరోవైపు పోడు భూముల అంశం కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది.