సీఎం కేసీఆర్ బంఫర్ ఆఫర్ : ఆయిల్ పామ్ సాగు చేస్తే రైతులకు రూ.36000 పెట్టుబడి ప్రోత్సాహకం
Telangana Cabinate Meet. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో
By Medi Samrat Published on 14 July 2021 4:00 PM GMT
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో భేటీ అయిన కేబినెట్ నిర్ణయించింది. రానున్న 2022–23 సంవత్సరానికి 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు ఎకరాకు మొదటి సంవత్సరం రూ.26,000, రెండవ సంవత్సరం ఎకరాకు రూ.5,000, మూడవ సంవత్సరం ఎకరాకు రూ. 5,000 చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీగా అందచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అటవీ శాఖ, అటవీ అభివృద్ధి కార్పోరేషన్ తో పాటు పంచాయితీరాజ్ మరియు రూరల్ డెవలప్ మెంట్ శాఖల సహాయంతో ఆయిల్ పామ్ మొక్కల నర్సరీలను పెంచాలని కేబినెట్ సూచించింది.
ఆయిల్ పామ్ పంట విధానం గురించి మరింతగా తెలుసుకోవడానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన అధ్యయన బృందం, కోస్టారికా, మలేషియా, థాయ్ లాండ్, ఇండోనేషియా తదితర దేశాలలో పర్యటన చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్ (టిఎస్.ఐ.డి.ఈ.ఏ), తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (టి.ఎస్.ఎఫ్.పి.జెడ్) నిబంధనల ప్రకారం అందించే ప్రోత్సాహకాలు అందచేయాలని అధికారులకు కేబినెట్ సూచించింది.